28, మే 2012, సోమవారం

౨౮మే౨౦౧౨, సోమవారం

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జన్మదినం నేడు! ఎందుకో ఒక పాట గుర్తుకు వస్తుంది! బహుశా శ్రీ కృష్ణుడు అంటే ముందు గుర్తుకు వచ్చేది రామారవేగా!:
***
ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు
కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగే పద్మనాభుడు
***
(ఈ వెబ్సైటుకి కృతజ్ఞతలు)


..మీ అనిల్

20, మే 2012, ఆదివారం

౨౦మే౨౦౧౨, ఆదివారం

అందరూ వినండహో! ఆదివారం మాంసం తింటే ఏడు జన్మల వరకూ వదిలిపెట్టని పాపాలు, రోగాలూ పట్టుకుంటాయంట! ఇక మాంసం దుకాణాల వాళ్ళు శనివారం/ఆదివారం రోజుల్లో అన్నీ మూసుకుని వెళ్ళాలి కాబోలు!
అలాగే ఆదివారం సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రపోతే మహా పాపం అంట! పైన చెప్పిన మాటలన్నీ జీ తెలుగు లో గోపురం కార్యక్రమంలో చెప్పారు! ఒక్క విషయం చెప్పాలి. దీనికి కారణాలు/మూలాలూ చెప్పకుండా
ఊరికే చెప్తూ పోతే ఎలా వుంటుంది? వీటికి తప్పకుండా ఒక మూల కారణం, శాస్త్రీయపరంగా కారణం వుండి వుంటుంది. మాంసం తినటం మంచిది కాదని తెలుసు కాని దానికి కారణాలు చెప్పకుండా సరిపెట్టటం మంచిది కాదు.
ఉదాహరణకి గుడికి వెళ్తే మంచిది అని, పాపాలు తొలగిపోతాయని ఎందుకు అంటారో ఎవరికైనా తెలుసా? కారణాలు చెప్పకుండా వుంటే అదేదో మతానికి సంబంధించిందని అనుకుంటారు.
కానీ గుడిని కట్టే స్థలం దెగ్గర అయస్కాంతపు శక్తి వుంటుందని ఎవరికైనా తెలుసా? దాని వలన మనసుకు శాంతి కలుగుతుందని చెప్తే ఎంత బాగుంటుంది? ఇలా నిజాలను కప్పేసి అది చేయండి, ఇది చేయండి, ఈ మంత్రాన్ని చదవండి,
ఆ మంత్రాన్ని చదవండి అంటూ వుంటే ఎలా వుంటుంది? ఈ యుగంలో మనిషి అర్థం చేసుకోలేని విషయాలు చాలా తక్కువ. అర్థం చేసుకోలేకపోవటానికి ఇదేమీ క్షిపణి/రోదసి శాస్త్రం కాదు!

పాడుతా తీయగా లో బాలు ఎపుడూ చెప్పే మాట : "సర్వే జనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు!" నాకు బాగా నచ్చింది.

..మీ అనిల్

16, మే 2012, బుధవారం

౧౬మే౨౦౧౨, బుధవారం

చాలా రోజుల నుంచి వ్రాయటానికి సమయం కుదరలేదు. ఎన్నో పనులు, ఏవేవో కొత్త విషయాలు, ఎన్నో అనుభూతులు.
కొంత మంది మూర్ఖత్వము వలన జీవితాలే మారిపోతున్నాయి. కాని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరు మంచి, ఎవరు చెడు అని కాదు. తప్పు చేసిన వాళ్ళు వారి తప్పుని ఎలా సరిదిద్దుకుంటున్నారు, వాటిని పునరావృతం కాకుండా ఎం చేస్తున్నారు అనేది ముఖ్యం. కొన్ని సార్లు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతుంటాయి.అవి ఎవరివలన అయినా జరగొచ్చు. నెనెప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. మాట మీద నిలబడటం కొంతవరకైనా తెలియాలి. లేకపోతే మన మీద వున్న నమ్మకం ఆవిరైపోతుంది. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ సంపాదించటం చాలా కష్టం, పైగా సమయం పడుతుంది. ఆ సమయం కోసం వేచి చూస్తున్నాను. ఎప్పటికైనా మారతారనే నమ్మకం వుంది. 

..మీ అనిల్

1, మే 2012, మంగళవారం

౧మే౨౦౧౨, మంగళవారం: రగడ!

ఈ రోజెందుకో చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత  వుండాలనిపిస్తుంది! దానికి కారణమేంటో తెలియదు కాని ఒక రకమైన ఉత్తేజం, కొత్త శక్తి వున్నట్లు వుంది! ఈ రోజు కార్మికుల రోజు. బహుశా వారి బలమే అంతటా వ్యాపించిందేమో!
ఇదే ఉత్తేజం లో ౨౦౧౦లొ వచ్చిన  రగడ చిత్రం పాటలు విన్నాను. చాలా కొత్తగా వున్నాయి. 

..మీ అనిల్

28, ఏప్రిల్ 2012, శనివారం

౨౮ఏప్రిల్౨౦౧౨, శనివారం

మొన్న ఈ మధ్య "సి ఎన్ ఎన్ ఐ బి ఎన్" వాహిని లో బోఫోర్స్ కుంభకోణం మీద ఒక చర్చాగోష్తి చూసాను. అందులో ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు ఎలా మాట్లాడుతున్నారంటే రాజీవ్ గాంధీ కి అసలు బోఫోర్స్ లో సంబంధమే లేదన్నట్టు చెప్తున్నారు! ఎవరి చెవిలో పువ్వు పెట్టాలని? పైగా స్విస్ రక్షణ అధికారి ఒకరు రాజీవ్ గురించి మాట్లాడాడని వారిని అర్థం లేని మాటలతో ముంచెత్తారు! "నెహ్రు పేరు ఎలా పిలవాలో తెలియని ఒక అపరిచితుడి మాటలు ఎందుకు నమ్మాలి?" అంట.
అబద్ధాన్ని నిజం చేయటం మోసం.
ఇలా ప్రజల్ని మోసం చేయటానికే అతను ఒక కేంద్ర మంత్రి అయితే ఎక్కడైనా ఒక బుల్లి గిన్నెలో నీళ్ళు నింపుకుని అందులో మునిగి చావమను! అలాగైనా ఈ భుఉమి మీద ఒకరి భారం తగ్గిద్ది!

..మీ అనిల్

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

౨౭ఏప్రిల్౨౦౧౨, శుక్రవారం

ఈ రోజే "దమ్ము" చిత్రం విడుదల! ఫేస్బుక్కులో ఎక్కడ చూసినా దాని గురించే సందేశాలు వున్నాయి. మొదటి సూచనల ప్రకారం ఈ చిత్రం విజయవంతం అవుతుందనే అనిపిస్తుంది!
ఎంతైనా రామ రావు కన్నా బాగా తెలుగు ఉచ్చరించగలిగిన వారు లేరు! అలాగే రామా రావు మనవడు కూడా అంతే బాగా మాట్లాడుతాడు!


..మీ అనిల్

26, ఏప్రిల్ 2012, గురువారం

౨౬ఏప్రిల్౨౦౧౨, గురువారం

"గురువారం మార్చి ఒకటి, సాయంత్రం..." ప్రతి గురువారం ఈ పాట గుర్తుకు వస్తుంది! ఆ పాటకున్న పేరు అలాంటిది మరి!!
జీవితంలో ఎంతో మంది ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ వుంటారు. మొన్న ఆదివారం "అయ్యారే" చిత్రం చూస్తున్నప్పుడు అనిపించింది:
"ఎవరినైనా నమ్ము, నమ్మకపో కాని ముందు నిన్ను నమ్ముకో" వివేకానందుడు చెప్పిన మాటలవి. కాని ఈ రోజుల్లో ఎంతో మంది నామ మాత్రానికి దేవుడికి మొక్కటం, సోది చెప్పించుకోవటం చేస్తున్నారు. మనకు దూరం గా సంబంధం లేని వాళ్ళు ఇలాంటివి చేస్తే పర్లేదు. కాని దెగ్గరగా వుండే వాళ్ళే ఇలాంటివి చేస్తే ఏమని చెప్పగలం?
"అయ్యారే" లో చెప్పింది కూడా అదే: మనల్ని మనం నమ్మనంత వరకు దొంగ బాబాలు, బూటకపు స్వాములు వస్తూనే వుంటారు.


..మీ అనిల్

23, ఏప్రిల్ 2012, సోమవారం

౨౨ఏప్రిల్౨౦౧౨, ఆదివారం

ఈ రోజు "అతిథి నువ్వెప్పుడు వెళ్తావు?"(హిందీ లో "అతిథి తుం కబ్ జావోగే?") చూస్తున్నాను! పరేష్ రావళ్ ఎప్పటిలాగే బాగా చేసారు! ఆయన చేసే ప్రతి పాత్రలో ఒక వైవిధ్యం, తన సొంత ముద్ర వేస్తారు!
ఈ వేసవి కాలం లో, అదీ బెంగుళూరు(సాధారణంగా చల్లగా వుండే ఊరు) లో ఇంత వేడిని తట్టుకోవటం మాటలు కాదు.
సాయంత్రం "మా" వాహినిలో వేసిన "అయ్యారే" చిత్రం బాగుంది. ఇందులో రాజేంద్ర ప్రసాదు గారు బాగా చేసారు. కథ కుడా బాగానే వుంది కాని పెద్ద నటీ నటులు లేకపోవటం వలన అంత బాగా ఆడివుండకపోవచ్చు.

..మీ అనిల్

17, ఏప్రిల్ 2012, మంగళవారం

౧౭ఏప్రిల్౨౦౧౨, మంగళవారం

ఈ రోజు మర్చిపోలేని రోజు! తొలకరి చినుకులు పడ్డాయి! ఆకాశం నుంచి జారిపడిన మొదటి చినుకులు భూమిని తాకితే వచ్చిన సువాసనలో, చల్లని గాలి వీస్తూ వున్న వేళ ఇంటికి దగ్గరయ్యాను! 
రెండు రోజులనుంచి ఆకాశాన సూర్యుడు సెలవు తీసుకున్నట్టు వుంది!
ఈ సమయాన నేను ౨౦౦౭లో ముంబైలో  వుంటున్నప్పుడు ఆంగ్లం లో వ్రాసిన ఒక కవిత గుర్తుకు వస్తుంది! ఆ కవిత చాలా మందికి బాగా నచ్చింది. అది ఇక్కడ వుంది.

..మీ అనిల్

16, ఏప్రిల్ 2012, సోమవారం

౧౬ఏప్రిల్౨౦౧౨, సోమవారం: పెద్ద చిత్రాల పండగ!

నాకు చలన చిత్రాలంటే ఒక రకమైన ఇష్టం. ఇష్టం అంటే అదే పనిగా ఏ చిత్రం వచ్చినా ఈలలు వెస్తూ చూసే రకం కాదు! పలానా చిత్రంలో ఎంత కళ వుంది, ఎంత మంచి నటన వుంది(ముఖ్యంగా ఆ చిత్రంలో కథానాయకుడు ఎంత బాగా సంభాషణలు చెప్పాడు, పాటల రచన,...) లాంటివి గ్రహిస్తాను, చూస్తాను. నిన్న జరిగిన "గబ్బర్ సింగ్" పాటల ఆవిష్కరణ ఉత్సవం చూసిన తర్వాత జనానికి నచ్చే ఒక మంచి చిత్రం వస్తుందని అనిపించింది. హిందీ భాషలో "దబంగ్" ఎలాగో చాలా మంది చూసేసి వుంటారు. దాని ప్రభావం ఈ చిత్రం భవిష్యత్తు పైన, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు పైన ఎంతైనా వుంటుంది.
వచ్చే నెల రోజుల్లో దమ్ము చిత్రం లాగా జనాన్ని అలరించే చిత్రాల పట్టికలో ఈ చిత్రం కూడా చేరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోని సంభాషణలు అల వున్నాయి. అలాగే దేవి శ్రీ ప్రసాదు బాణీలు కొత్తగా, ఆకట్టుకునేలా వున్నాయి. ఈ పాటలను ఈ రోజు పొద్దున్న ప్రయాణిస్తున్నప్పుడు విన్నాను. బాగున్నాయి! అలాగే దమ్ము పాటలు కుడా ఉత్సాహాన్ని పెంచే రకంగా వున్నాయి.
ఇక రాజమౌళి "ఈగ" విషయానికి వస్తే అది ఈ రెండు చిత్రాలను తట్టుకుని ఎగరగలదో లేదో వేచి చూడాల్సిందే! ఎందుకంటే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ పెద్ద నటులు లేరు. అయినా రాజమౌళి చిత్రం అనగానే ప్రజలకు, అభిమానులకు ఎన్నో ఆశలు వుంటాయి! వాటిని తప్పకుండా అందుకుంటుందని అనిపిస్తుంది!

..మీ అనిల్