31, మార్చి 2012, శనివారం

౩౧మార్చి౨౦౧౨,శనివారం

నిన్న సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రయాణం చాలా ఒంటరిగా అనిపించింది.ఒకవైపు కొత్త అవకాశం వచ్చిందని ఆనందపడాలో, లేక ఇన్నాళ్ళూ వున్న"కే పి ఐ టి" లో నేర్చుకున్న వాటిగురించి, వేల్లిపోతున్నందుకు బాధ పడాలో తెలియట్లేదు! రెండూ కలిసి పోయి వస్తున్నాయి! ఇంతమంది వున్నా ఒంటరిగా వున్నట్టు అనిపించటం బహుసా మొదటి సారి కాకపోవచ్చు. కాని ఇలాంటి అనుభవం, పనిచేసిన చోట ఇంత ఎక్కువ సేపు వీడ్కూలు చెప్పటం ఇదే మొదటి సారి.
ఇక ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం జెమిని చిత్రాలు లో వచ్చిన "ఈగ" సంగీత విడుదల కార్యక్రమం గమ్మత్తుగా కొత్తగా బాగుంది. ఈగ చిత్రం కుడా బాగుంటుందని ఆశిస్తున్నాను.
ఈ పొద్దున్న చూసేటప్పటికి చిన్న వర్షం పడింది, కే పి ఐ టి కి అనుమతి తీసివేయబడింది. ఇక ఈ రోజు, రేపు ఏవేవో పనులు వున్నాయి.


..మీ అనిల్

30, మార్చి 2012, శుక్రవారం

౩౦మార్చి౨౦౧౨, శుక్రవారం

"కే పీ ఐ టి" లో ఈ రోజే నా చివరి రోజు. ఈ సమయం లో నాలో ఎన్నో భావాలు పొంచి వున్నాయి. ఒక భావం నన్ను ఏమని అడుగుతుందంటే: "ఎప్పటి లాగా కాకుండా ఈ రోజు కొత్తగా ఎం చేస్తున్నావు?" మరో భావం ఏమంటుందంటే:"ఎందుకు కొత్తగా చేయాలి? ఇదేమన్నా గొప్ప విశేషమా? ఎంతోమంది మారుతూ వుంటారు. ఈ రోజు చేయాల్సిన పనులు ముగించుకుని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారానికి సిద్ధం అవ్వు!"
ఇంకొక భావం: "సోమవారం ఒక కొత్త వాతావరణానికి వెళ్తున్నావు కాబట్టి రేపు ఒక సారి అక్కడికి వెళ్తాం మంచిది!"
ఏమైనా ఇదొక కొత్త అనుభవం. ఒక్కోసారి ఏదో కోల్పోతున్నట్టు వుంటుంది. మరోసారి కొత్త అవకాశం వచ్చినందుకు సంతోషంగా వుంటుంది. ఏది ఎలా అయినా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం ముఖ్యం.
"కే పీ ఐ టి" లో వున్నా ఇన్ని రొజులూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానికి అవకాశం దొరికింది. అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయినా, వేరే పరికరం అయినా, ఏదైనా. ఇవన్నీ ముందు ముందు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.


..మీ అనిల్

29, మార్చి 2012, గురువారం

౨౯మార్చి౨౦౧౨, గురువారం

రెండు నాలికల, రెండు మొహాల వాళ్ళు: ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వుండాలి.
మన ముందు ఒకలా, వెనక మరోలా వుండే వాళ్లకి ఎంత దూరంగా  వుంటే అంత మంచిది. వీళ్ళ వలన మనుషుల మధ్య అపార్థాలు రావొచ్చు. అవే కాలక్రమేనా గొడవలుగా మారొచ్చు.
నిన్న ఈనాడు వాహినిలో "వావ్" ఆట కార్యక్రమం చివరి భాగం వచ్చింది(శుక్రవారం వేసింది మల్లీ వచ్చే బుధవారం వేస్తారు.). తన రెండవ చలన చిత్రం "లవ్లీ" తో మన ముందుకు రాబోతున్న ఆది వచ్చాడు. బాగుంది.

ఆంగ్లంలో కొత్త లిపి ఒకటి చూసాను. దాని పేరు "Eaton". బాగుంది.

..మీ అనిల్

౨౮మర్చి౨౦౧౨, బుధవారం

నిన్న మారుతీ వైద్యశాల లో అక్కడ వ్రాసిన ఒక వాక్యం చదివాను!
"empower the self with peace to become divine". అంటే మనసును ప్రశాంతంగా వుంచుకుంటే దైవత్వం వస్తుందని! దైవత్వం రావటం మాట ఏమో కాని ముందు మనుషులు రాక్షసులుగా మారకుండా వుంటే అదే చాలు!
చివరకు నా రక్తం ఓ-ve అని రుజువయ్యింది!
ఇప్పుడే ఒక పిల్లి దృశ్య మాలికని చూసాను! పిల్లుల చేష్టలు ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది!


..మీ అనిల్

28, మార్చి 2012, బుధవారం

౨౭మార్చి౨౦౧౨, మంగళవారం

నిన్న ఈనాడు వాహిని లో రాత్రి ౯.౩౦కి వచ్చిన "పాడుతా తీయగా"-(చిన్నారుల సంచిక) రాజమండ్రిలో నిర్వహించారు.
రాజమండ్రి గురించి వాహినిలో ఎప్పుడు వచ్చినా, చిన్ననాటి గుర్తులు వస్తూ వుంటాయి. ఆ రోజుల్లో "సెంట్ అన్న్స్" బడికి ఒక చిన్న రిక్షాలో వెళుతూ అక్కడి మిత్రులతో సరదాగా గడిపిన సమయం, తరగతుల్లో ఆటపట్టించటం, వగైరా మదిలోకి వస్తాయి. "ఉప్పొంగెలే గోదావరి" అనే పాట అయితే ఎన్ని అనుభూతుల్ని తెస్తుందో చెప్పలేను.
ఒక సారి గోదావరిలో పడవ మీద పట్టుసీమ వెళ్ళాము. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూ వుంటాయి.
రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ధూమశకటంలో ప్రయాణిస్తున్నప్పుడు గోదావరి నది మీద కుండా వెళ్ళాలి. అప్పుడు నదిలో రూపాయి బిళ్ళ వేసేవాళ్ళం! అప్పట్లో అదొక నమ్మకం!
అలాగే ఇంటి వెనక వున్నపెరట్లో వున్న జామచెట్టు ఎక్కటం అంటే నాకు ఎంతో ఇష్టం! అదేదో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా వుండేది! వేసవి కాలంలో ఎక్కడో దొరికిన ఒక చాపని బుల్బ్ లో నీళ్ళు పోసి ఆడించాను! అదే నేను చూసిన, ఆడుకున్న మొదటి "ఆక్వేరియం"! ఇదే సమయం లో నాకు బొమ్మలు గీయటమన్నా, చలన చిత్రాలన్నా ఇష్టం పెరిగింది!
ఎప్పుడో ఆంగ్లేయుల కాలం నాడు మన కోసం ఒక కట్ట(ధవళేశ్వరం బారేజి) కట్టాడని ఆ ఆర్థర్ కాటన్ ని ఇప్పటికీ అభిమానించే ఊరు ఇది!. ఎప్పటికైనా మళ్ల్లీ గోదావరి తీరానికి చేరాలని వుంది...

..మీ అనిల్

27, మార్చి 2012, మంగళవారం

౨౬మార్చి౨౦౧౨, సోమవారం

నిన్న, ఈ రోజు ఎందుకో సరిగ్గా వ్రాయలేకపోయాను. బహుశా కొత్త పనికి సంబంధించిన పనుల్లోనో, లేక ఇంటి పనుల్లో వుండటం వలనో ఏమో. ఈ రోజు చాలా ముఖ్యమైన పనులు వున్నాయి. నేను వెళ్లబోయే కొత్త కార్యాలయం లో చేరటానికి పుఉర్తి చేయాల్సిన పనులలో మునిగిపోయాను. అలాగే నా ఎక్ష్పీరియ లో కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించాను. అంత కొత్త సదుపాయాలెమీ లేవు కానీ వేగం కొంచెం పెరిగినట్టు అనిపించింది. అలాగే వాయో కి మరింత రక్షణ కోసం వున్న నోర్టన్ ని నవీకరించాను.
సాయంత్రం అసిఅనేట్ సువర్ణ లో మూర్ఖత్వం హద్దులు దాటింది. ఆదిత్య వారం అంటే తెలియని మొద్దు మొహం ఒకటి అందులో వచ్చే "కోట్యాదిపతి" లో వచ్చింది. ఇలాంటి వాళ్లకి ఈ జాతి సంస్కృతి గురించి మాట్లాడే అర్హత ఎక్కడినుంచి వస్తుంది? మాట్లాడితే మా రాజ్యం, మా భాష అంటూ ఎగరేసుకుంటూ ఉళ్ల మీద పడే వీళ్ళ నిజ స్వరూపం ఇది! డబ్బా కొట్టుకోవటం తప్ప ఏమీ తెలియని మొహాలు, వాళ్ళు! మాంచి వినోద కార్యక్రమం అంటే ఇది! హహహ...


..మీ అనిల్

26, మార్చి 2012, సోమవారం

౨౫మార్చి౨౦౧౨, ఆదివారం

"ఎగరటం మొదలు పెట్టిన ఈగ!": ఈ రోజే ఈగని దూరదర్శిని పెట్టెలో మొదటి సారి చూసాను!! ౩౦మార్చి౨౦౧౨న "జెమిని చిత్రాలు" వాహినిలో రాబోయే ఈ చిత్ర సంగీతం తప్పకుండా సరికొత్తగా, ఆసక్తికరంగా వుంటుందని ఆశిస్తున్నాను! ఈగ ఈగ ఈగ ఈగ!
సాయంత్రం వచ్చిన "పిల్ల జమీందారు" చిత్రం కొంచెం నిరాశపరిచింది. ఎందుకో కానీ దర్శకుడికి కథ మీద పట్టు పోయిందనిపించింది. చివరకు వచ్చేసరికి కొంచెం బాగుందనిపించింది కానీ మొత్తం మీద చిత్రం నిరాశనే మిగిల్చింది. బహుశా ఈ చిత్రం నుంచి మరీ ఎక్కువ ఆశించి వుంటాను. నాని నటన బాగానే వున్నా, కథ, కథనం కొంచెం బాగా వుండి వుంటే ఇది ఒక మంచి చిత్రం అయ్యివుండేది.


..మీ అనిల్

24, మార్చి 2012, శనివారం

౨౪మార్చి౨౦౧౨, శనివారం


ప్రభుత్వ కార్యాలయం లో వుండటం అనేది అందులో పని చేసే అధికారుల అదృష్టం, ప్రజల దురదృష్టం. అక్కడ జరుగుతున్న అవినీతిని ఎదుర్కొనే శక్తి లేక అక్కడ ఎంత మంది ఎలా నలిగి పోతున్నారో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. దాని గురించి ఈ రోజు జరిగిన కథ చెప్పే తీరిక, అవసరం లేదు, ఉపయోగం అస్సలు లేదు. అందరికీ తెలిసినదే.
"అదిరిన వేదం!": మనల్ని ఆలోచింపచేసే చిత్రం చుసి చాలా రోజులు అయ్యింది. అలాంటి ఒక చిత్రమే "వేదం". ఎప్పటినుంచో చూడాలనుకున్తున్నా, కొన్ని కారణాలవలన చుడలేకపోయాను. సమాజంలోని వివిధ కొనాలుంచి సహజ సిద్ధంగా అనిపించే పాత్రలను తీసుకుని తీసిన ఈ చిత్రం వ్యాపారపరంగా అంత పెద్ద చిత్రం కాకపోయినా రాధాకృష్ణ జాగర్లముడి గారి అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే విధంగా వుంది. "ఈ ప్రపంచంలో వున్నవి రెండే కులాలురా : డబ్బున్నవాడు, లేని వాడు"--చిత్రంలో నిజం చెప్పాడు! పైగా డబ్బున్నంత వరకూ ఎలాంటి కులాలూ అడ్డు రావు. అది లేనప్పుడే అన్ని కులాలూ, హద్దులూ, వాటాలూ, రాజకీయ నాయకుల వాగ్ధానాలూ వచ్చేస్తాయి! కొంతమందికి మనసులో ఎక్కడో ఒకచోట మానవత్వం అనేది వుంటుంది. అది కొన్ని సందర్భాలలో బయటికి వస్తుంది. అలాంటి కొన్ని సందర్భాల సమాహారమే "వేదం"! కొన్ని సన్నివేశాలకు కళ్ళు చమరించాయి. అంతిమ సన్నివేశాలలో అయితే రాతి గుండెని కుడా కదిలించే శక్తి వుంది!


..మీ అనిల్

౨౩మార్చి౨౦౧౨, శుక్రవారం: ఉగాది!


ఎప్పటి లాగే ఈ ఉగాది రోజున కుడా అచ్చ తెలుగులో వ్రాయటం నాకు చాలా సంతోషంగా తృప్తిగా వుంది! ఎంతైనా మాత్రు భాష కదా! ఎవరికైనా ఆనందమే. తెలుగు భాష ఒక సముద్రం లాంటిది. అందులో నాకు తెలిసింది ఒక చుక్క మాత్రమే. కానీ ఆ ఒక్క చుక్కలో కుడా ఎంత సంతోషం వుంటుందో వ్రాసే కొద్దీ తెలుస్తుంది!
ఈ రోజే మొదలైన నందన నామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలను తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నామని రాజకీయ నెతలందరూ అంటుంటే నవ్వొస్తుంది! ఈ లోకంలో ఎవరికీ వేరే ఎవరిమీదా అంత ప్రేమ, వాత్సల్యం వుండవు. ఎవరికైనా ముందు వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని వుంటుంది కాని ఎవరి గురించో పోరాడే సంస్కృతి లేదు ఇక్కడ. ముందు వాళ్ళ పరివారం సుఖంగా వుంచుకుని తర్వాత కుదిరితే సమాజం కోసం ఏదైనా చేద్దాం అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎవరికైనా జీవితం ఇచ్చేది, ఒక దారి చూపించేది తన కుటుంబం. పులి మేకను వేటాడి తన పిల్లలకు పెట్టిన తర్వాతా మిగిలిపోయిన దాన్ని నక్కలకు వదిలేస్తుంది. కాని పాపం మేకని నక్కలకు వదిలేద్దాం అని కూర్చుంటే పులులు బతకగాలవా? మానవ సమాజం కుడా అంతే. కాకపోతే మానవుడు ఇంకా తినాలని వేతాడుతాడు, మృగాలు బ్రతకటానికి వేటాడుతాయి. ఇదంతా సహజం, న్యాయం కుడా. బలవంతుడే రాజు. బలహీనుడే బానిస.
"పంజా+కాంచన+బద్రినాథ్!": ఉగాది కానుకగా ఈ రోజు చూసిన చలన చిత్రాలు ఇవి!మధ్యాహ్నం బద్రినాథ్ తో మొదలైన వినోదం రాత్రి ౧౦ దాకా అంతరాయం లేకుండా సాగుతూ వుంది! బద్రినాథ్ లో అయితే తీవ్రవాదుల్ని ఒక్క మాట కుడా లేకుండా అంతం చేసిన విధానం బాగా నచ్చింది. తక్కువ మాటలు, ఎక్కువ శిక్ష! ఎలాగైతే వాళ్ళని కేవలం ఒక కత్తితో నరికాడో, అలాగే మన సైన్యం కుడా కార్గిల్ లో కనికరం లేకుండా పని పూర్తిగా ముగించి వుంటే నేడు పాకిస్తాన్ కి ఇంత పొగరు వుండేది కాదు, ఈ మధ్యన మన భారత దేశంలో వాళ్ళు ఎన్నో చోట్ల సృష్టించిన మారణకాండ జరిగెదీ కాదు. మన మంచితనాన్ని బలహీనతగా, పిరికితనంగా అనుకునేవాల్లకి బద్రినాథ్ లో చూపించినట్టుగానే జరగాలి. అది చుసి మిగతా శత్రువుల గుండెల్లో భయం పుట్టి వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్లిపోవాలి. అందులో నాకు నచ్చిన సంభాషణ: "మన మతాన్ని పుజిద్దాం, బయట మతాలని గౌరవిద్దాం".
కాంచన లో హిజ్రాలను మామూలు మనుషుల లాగా, మన లాగానే ఏదో ఒకటి సమాజంలో సాధించే వారిలాగా చూపించిన విధానం బాగా నచ్చింది. వారికి గొప్ప సహాయం చేయకపోయినా పర్వాలేదు కాని వారిని హింసించటం, నవ్వుల పాలు చేయటం పాపం. వారు కుడా పోరాటం ఆపకుండా గౌరవంగా ముందుకు సాగి దేశ ప్రగతిలో ఒక మంచి పాత్ర పోషించే రోజు వస్తుందని ఆశిద్దాం. కొంతమంది నీచుల వలన అందరికీ చెడ్డ పేరు రావటం సహజం. కాని పోరాడటం ప్రకృతిలో ఒక ముఖ్యమైన ధర్మం. ఏ దారీ లేదు కదా అని అడుక్కోవటం, రహదారి మధ్యలో, ధూమశకటాలలో మిగతా అమాయకులని హింసించటం, ఇబ్బంది పెట్టటం పిరికితనం అనిపించుకుంటుంది.
పంజా లో కథ అంత కొత్తగా లేకపోయినా, ఆ కథని చూపించిన తీరు(కథనం) నచ్చింది. ఎందుకో ఏదో కారణం వలన లేదా అంతిమ ఘట్టం అంత గమ్మత్తుగా లేనందున ఈ చిత్రం అంత బాగా ఆడకపోయి వుండొచ్చు. కాని వ్యక్తిగతంగా నాకు మాత్రం నచ్చింది.



..మీ అనిల్

23, మార్చి 2012, శుక్రవారం

౨౨మార్చి౨౦౧౨, గురువారం


తడిసిన కళ్ళు: మనం పని చేసిన వాళ్ళతో ఎంత కాదన్నా ఒక అనుబంధం రూపుదిద్దుకుంటుంది. చాలా సార్లు ఆ విషయం మనం విడిపోయే సమయం దాకా తెలియదు! ఈ రోజు కుడా అలాంటిదే జరిగింది.ఒకే జట్టులో పని చేసిన వాళ్ళు ఒక్కొక్కరిగా వెల్లిపొతూ వున్నారు. ౨౮న నేను కుడా వెలుతున్నప్పుడు ఎలా వుంటుందో తెలియదు కాని ఈ రోజు మాత్రం శూన్యంలా అనిపించింది. చివరి సారి తనకు వీడ్కోలు చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు. ముందు ముందు తప్పకుండా మల్లీ కలుసుకుంటాం అనే నమ్మకం వుంది. ఎందుకంటే ఈ గుండ్రపు భూమిలో జీవితంలో ఎన్నో సార్లు కలుసుకునే అవకాశాలు తప్పకుండా వస్తాయి.


..మీ అనిల్

21, మార్చి 2012, బుధవారం

౨౧ మార్చి ౨౦౧౨, బుధవారం

భారత జట్టుకి ఏదో అయ్యింది. గెలవాల్సిన ఆటలు గెలుస్తుంది కాని గతంలో ఓడిన ఆటల వలన మనం అంతిమ పోరాటానికి చేరుకోలేకపోతున్నాం. దీనికి దురదృష్టం తోడయ్యేతలికి జట్టుకి ఇంకా బాధాకరంగా వుంటుంది.
ఆస్ట్రేలియాలో ఎదురైనా చెడు అనుభవం ఇప్పుడు మళ్లీ ఎదురైంది మనకు. బంగ్లాదేశ్ పైన మనం సునాయాసంగా గెలుస్తాం అనుకున్నాం కాని మనం సరిగ్గా బంతులు వేయకుండా మన కష్టాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టయ్యింది.
కాని ఒక మంచి విషయం ఏంటంటే కోహ్లి లాంటి మంచి పోరాడే ఆటగాడు మన జట్టులో వుండటం మన అదృష్టం!
..మీ అనిల్

20, మార్చి 2012, మంగళవారం

౨౦ మార్చి ౨౦౧౨, మంగళవారం


రూపాయి చిహ్నం
Rs అనే పదానికి చిహ్నాన్ని రాయటానికి ఒక జావా స్క్రిప్ట్ ఒకటి కనుక్కున్నాను! కాని అది పని చెయ్యట్లేదు. అది చెయ్యటానికి రక రాకాల మార్గాలు చూస్తున్నాను. కాని ఇప్పటిదాకా పనిచేయించలేకపోయాను :(

..మీ అనిల్

19, మార్చి 2012, సోమవారం

౧౯ మార్చి ౨౦౧౨, సోమవారం

ఇన్నాల్లూ దాగివున్న నిరాశ, అలసట అన్నీ ఒకేసారి పటాపంచలైతే ఎలా వుంటుందో నిన్న ఆదివారం పాకిస్తాన్ మీద గెలిచిన మన భారత జట్టు చూపించింది.
ఈ రోజు నాకూ జరిగింది. ఒక కల నిజమైతే ఎలా వుంటుందో అలా వుంది. "జల్సా" చలన చిత్రంలో పాడినట్టు: "గాల్లో తేలినట్టుందే..."!!
ఇదే రోజు నా జట్టుతో, నా సహధర్మచారిణితో ఎన్నటికీ మర్చిపోలేని క్షణాలు నా సొంతం అయ్యాయి. ఇలాంటి క్షణాలు రావటం నా అదృష్టం!
నా శ్రీమతి ఎంత దూరాన వున్నా నా పక్కనే వున్నట్టు వుంటుంది!
..అనిల్

17, మార్చి 2012, శనివారం

౧౭ మార్చి ౨౦౧౨, శనివారం


నరేంద్ర మోడి గురించి టైం మాగజిన్లో వచ్చిందంటే అందులో తప్పకుండా విషయం వుంది.
అనవసరంగా పని పాట లేక గోధ్రా గురించి మొరిగే కుక్కలకు వ్యాపారం అంటే ఏంటో తెలీదు.
అలాగే ఎప్పుడూ మొసలి కన్నీళ్లు కార్చే పక్షాలకు వ్యాపారం అంటే ఏంటో అర్థం కాదు.
ఈ కాలంలో ఎవరి దగ్గర డబ్బుందో వాడే రాజు. అలాగే ఏ దేశంలో డబ్బు బాగా వుందో అదే ప్రపంచాన్ని ఏలుతుంది.
ఈ రోజుల్లో కుడా కులం పేరిట రాజకీయాలు చేయటం, వీల్లకింత వుంచటం, వాల్లకంత వుంచటం మూర్ఖత్వం.
నరేంద్ర మోడి మొత్తం భారత దేశానికి ప్రధానమంత్రి కాకపోవచ్చు కాని ఒక మంచి కలలా వుండటం ఖాయం.

..అనిల్

16, మార్చి 2012, శుక్రవారం

౧౬ మర్చి ౨౦౧౨, శుక్రవారం


ఒక్కోసారి ఉచితంగా వుండే సేవలే గొప్పగా, జీవితాన్ని మరింత సుఖమయం చేసేవిగా వుంటాయి.అలాంటిదే "గూగుల్ మాప్స్".జావాస్క్రిప్ట్ లో దాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు కుడా! గూగుల్ మాప్స్ ద్వారా బెంగులూరు లో తక్కువ దూరం వెళ్ళే దారి కనుక్కున్నాను!ఇలాంటి సేవల వలన ఎంతో ఉపయోగం వుంది!
మాములుగా గంట పట్టే ప్రయాణం అరగంట మాత్రమే పట్టిందంటే దానికి ముఖ్య కారణం నేను నా ఆన్ద్రోయిడ్ ఫోనులో వాడిన ఒక "గూగుల్ మ్యాప్" బొమ్మ. వెళ్ళాల్సిన చోటుకి పదకొండు గంటలకు చేరుకుంటాననుకుంటే పదిన్నరకే చేరుకున్నాను!

అప్పుడప్పుడు ఒక గుడిలో ఏ శబ్ధమూ లేకుండా ప్రశాంతంగా ఉండేటప్పుడు వుండే మనశ్శాంతి గొప్పది.అలాంటిదే ఒకసారి ఇక్కడి గుడిలో అనుభూతి చెందాను. ఒక శనివారం పొద్దున్నే స్నానం చేసి గుడిలో వున్నప్పుడు ఒక రకమైన శాంతి వాతావరణం వచ్చినట్టు,ఏదో ఒక శక్తి ఈ గాలిలో వున్నట్టు అనిపించింది.

ఎం టీవీ: మూర్ఖుల టీవీ!
అవును. ఎందుకు?వాళ్లకు "ఆరాధ్య" అంటే అర్థం తెలియని దవుర్భాగ్యం పట్టింది పాపం!
వింత ఏంటంటే వీళ్ళే విదేశాల నుంచి వింత వింత పదాలను తెచ్చి మరీ అర్థాలు చెప్తూ వుంటారు. అవును మరి. సొంత భాషంటే అంత చులకన అయిపోయింది, పశ్చిమ భాషలంటే అంత మోజు పెరిగిపోయింది.


.. అనిల్