25, ఏప్రిల్ 2017, మంగళవారం

శివగామి: బాహుబలి పుర్వాంకం

ఈ మధ్య అంతర్జాలం లో వచ్చిన "శివగామి" పుస్తకం చదువుతున్నాను. బాహుబలి చలన చిత్రం లో జరిగిన కథ కి ముందు జరిగినట్టుగా వ్రాసిన ఈ నవల నాకు చాలా బాగా నచ్చింది! దాంట్లోని కొంత భాగాన్ని తెలుగు లోకి అనువదించాలనిపించింది, కొన్ని పంక్తులు చేసాను! ఇవిగో, మీకోసం:

"
చీకటి. కటిక చీకటి. ఆ కాళరాత్రిని, మరణాన్ని సైతం భయపెట్టే చీకటి! ఇంతటి చీకటిలో ఆ గుర్రపు బండికి వేలాడి వున్న దీపం వేలాడుతూ ఆ బండితో పాటు వూగుతుంది. ఆమెకి దాన్ని ఆర్పేయాలని వుంది కానీ వాళ్ళు వెళుతున్న మార్గం ఎంత ప్రమాదంతో కూడుకుందో తనకి  తెలియంది కాదు. మార్గానికి రెండు వైపులా వున్న అడవి మార్గం పైకి ముంచుకొస్తున్నట్టు వుంది. వాళ్ళు అలా కొండల్లో వంపులు తిరుగుతున్న మార్గం లో ప్రయాణిస్తుండగా వేలాడుతున్న చెట్ల కొమ్మలు ఆమె ముఖాన్ని తాకుతూ వున్నాయి. ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. మనసు బరువుగా మారింది. ఎన్నో పాత జ్ఞాపకాలు ఆమె మది లో కదులుతున్నాయి. ఆ బాధ భరించలేనిది. చీకటి పొరల్లో నుంచి గత పన్నెండేళ్ళుగా తాను పాతిపెట్టిన ఆ జ్ఞాపకాలు మల్లీ ఇప్పుడు మెల్లగా అరుస్తున్నాయి. పీడకకల లాంటి ఆ ప్రదేశానికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు, కాని తప్పని పరిస్థితి! ఐదేళ్ళ వయసులోనే తన కుటుంబానికి జరిగిన ఆ ఘోరాన్ని దారిలో వున్న ప్రతి చెట్టు మల్లీ ఆమె ముందుకు తెస్తున్నాయి. ఇలా ఊహల్లో తప్పిపోయిన తను ఒక్కసారిగా బండి ఇచ్చిన ఒక కుదుపుకి సంయమనం కోల్పోయి తన తల బండికి కొట్టుకుంది.

“కుందేలు” బండి నడుపుతున్న రాఘవ అన్నాడు. ఎలాంటి చిన్న ప్రాణికి అయినా హాని చేయకుండా వుండలేనివాడు. గుర్రాల సవ్వడిని విని అడ్డంగా ఒక కుందేలు పరుగు పెట్టింది.
“ఇలాంటి సమయం లో వెళ్ళటం అవసరమా?” అలా ఎన్నో సార్లు అడిగాడు. కాని ఆమె మాట్లాడలేదు. దూరంగా, మలుపులు తిరిగిన మార్గం చివర ఒక కోట కనిపించింది. దాన్ని చూసి మల్లీ అడిగాడు: “వెనక్కి వెళదామా?”
దానికి ఆమె ఇచ్చిన హావ భావాన్ని చూసి రాఘవ గుర్రాల్ని ముందుకు కదిలించాడు.
ఆ దారిలో ఒకప్పుడు పూల తోట వుండటం ఆమెకి గుర్తుకు వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడంతా పిచ్చి చెట్లు మొలిచాయి. మరీ మెరక కావటంతో  ఆ దారిలో ముందుకు వెళ్ళటం చాలా కష్టం అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే లోతైన లోయ వుంది. ఇక లాభం లేదని దీపాన్ని పట్టుకుని ఆమెని దింపటానికి రాఘవ దిగి తన చెయ్యి అందించాడు. కాని ఆమె అందుకోకుండా కిందకి దూకి, దారి ముగిసిన చోటు దెగ్గరికి వెళ్లి చూసింది. దేగ్గర్లో భారీ జలపాతం శబ్దం వినిపిస్తుంది. ఇక్కడే ఒక వేలాడే వంతెన ఉండాలే అనుకుంది. పక్కకి చూడగా కనిపించింది. వెంటనే మెట్ల మీదుగా ఆ వంతెన ఎక్కి రెండు వైపులా వున్నా తాళ్ళను పట్టుకుని ముందుకు వెళ్ళసాగింది.
“నువ్వు నిజంగానే ఈ వంతెనని దాటాలనుకుంటున్నావా?” ఎప్పటిలాగే ఆమె మౌనం గా ముందుకు వెళ్ళసాగింది. కొంత దూరం తర్వాత తాళ్ళు లోతైన చీకటిలో మాయమైపోయాయి. తన కాళ్ళ కింద వున్నా ఒక చెక్క విరిగి లోయలోకి పడిపోయింది. రాఘవ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది! చలి లో కూడా ఆమె చేతులు చమటలు పట్టాయి.
ఈ ప్రయాణం చేయటానికి ముఖ్య కారణం పన్నెండేళ్ళ తర్వాత చిన్నప్పటి తన పని మనిషి లచ్మి ని కలవటం. తుది శ్వాసలో లచ్మి తనకి ఒక పుస్తకం ఇచ్చింది. అది ఆమె తండ్రి దేవరాయ ఆయన కూతురికి ఇమ్మని లచ్మి కి ఇచ్చాడట. ఆ పుస్తకం లో వున్నా భాష అర్థం కానిది.
దేవరాయ మాహిష్మతి రాజ్యం లో ప్రజల చేత గౌరవించబడిన , పేరున్న భూస్వామి. అదంతా చిత్రవధ కు ముందు. దాన్ని తలచుకునే సమయం ఇది కాదు. ఇప్పుడు తన దృష్టంతా ఈ వంతెన దాటడం మీదే వుంది.
ముందు ఏడడుగుల వరకు వంతెన మీద చెక్కలు లేవు. “జాగ్రత్త” అరిచాడు రాఘవ.
దీపాన్ని రాఘవ కి ఇచ్చి కొన్ని అడుగులు వెనక్కి వేసింది.
“నీకు పిచ్చా?” అతను అంటూనే వున్నాడు, ఆమె పరుగెడుతూ ఒక్క దూకు తో వంతెన అటువైపుకు క్షేమంగా చేరింది.

“దీపాన్ని నాకు విసిరేసి నువ్వు కూడా రా... పిరికి పంద!” అరిచింది ఆమె.
రాఘవ దీపాన్ని విసిరాడు. ఆ విసురుకి దీపం ఆరిపోయింది. ఇక ఆకాశంలో చుక్కలు తప్ప ఎటువంటి వెలుగు లేదు.

ఎలా రాను?
"

..మీ అనిల్